Harish Rao: ఢిల్లీలో అవార్డులిచ్చి.. గల్లీలో కేసీఆర్ను తిడుతున్నారు: హరీశ్ రావు
- అభివృద్ధి లేకుంటే వివిధ శాఖలకు అవార్డులు ఎందుకిచ్చారని ప్రశ్న
- తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వలేదని విమర్శ
- తెలంగాణ పథకాలను మోదీ కాపీ కొడుతున్నారని వ్యాఖ్య
- కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని ఆగ్రహం
తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని, ఢిల్లీలో అవార్డులు ఇచ్చి, గల్లీలోకి వచ్చి తిడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. వరంగల్ సభలో ప్రధాని మోదీ అభివృద్ధి జరగలేదని విమర్శలు చేయడంపై మంత్రి స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కారణంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
తెలంగాణకు నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పారని, అసలు తమకు రావాల్సిన నిధులనే ఆపేశారని ఆరోపించారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే రావాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలన్నారు. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొడుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని ఇవ్వాలన్నారు.
తాము కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ అడిగితే, వ్యాగన్ యూనిట్ ఇచ్చారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణకు రూ.20వేల కోట్ల నిధులు వచ్చేవని, ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రూ.500 కోట్లు మాత్రమే వస్తాయన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఈడీ, సీబీఐ ఉంటే తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకులుగా వాడుకున్నాయన్నారు. విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించామని, విదేశాలకు విద్య కోసం వెళ్లేవారికి రూ.20 లక్షల సాయం అందిస్తున్నామన్నారు.