Narendra Modi: తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయి: ప్రధాని మోదీ
- కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు పాకిందన్న ప్రధాని
- అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ కలిసి పని చేయడం దౌర్భాగ్యమని విమర్శ
- కేసీఆర్ కుటుంబ అక్రమాలపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని వెల్లడి
కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. రాష్ట్రం ఏం చేస్తోంది? అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి. తొలిసారి అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం” అని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసిందని ప్రశ్నించారు.
‘‘అవినీతి ఆరోపణల నుంచి డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ సర్కారు కొత్త వ్యూహాలను పన్నుతోంది. వీటిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పార్టీల వలలో తెలంగాణ కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి. దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కొత్త నాటకాలకు తెర లేపారు" అని మోదీ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పనిగా పెట్టుకుందని మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని మండిపడ్డారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి.. టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ ద్వారా మోసం చేశారని ఆరోపించారు.
‘‘తెలంగాణ వర్సిటీలో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేశారు’’ అని మోదీ అన్నారు.