amarnath yatra: వరుసగా రెండోరోజు నిలిచిన అమర్నాథ్ యాత్ర, చిక్కుకుపోయిన తెలుగువారు
- కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత
- యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుకు తరలింపు
- పంచతర్ణి ప్రాంతాల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారు
భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు నిలిచిపోయింది. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రను నిలిపివేశారు. యాత్రికులు బల్తాల్, నున్వాన్ బేస్, భగవతి నగర్ బేస్ క్యాంపులలో ఉండిపోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంచతర్ణి ప్రాంతాల్లో పదిహేను వందల మందికి పైగా భక్తులు చిక్కుకుపోయారు. ఇందులో 200 మంది వరకు తెలుగువారు ఉన్నారని తెలుస్తోంది.
శనివారం ఉదయం కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ కారణంగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుల్లో ఉంచారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం కూడా యాత్రను నిలిపివేశారు.