Vinod Kumar: వారసత్వ రాజకీయాలపై మాట్లాడే హక్కు మోదీకి లేదు: వినోద్ కుమార్
- బీజేపీలో 200 మంది నేతల వారసులు రాజకీయాల్లో ఉన్నారన్న వినోద్ కుమార్
- జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు అని వ్యాఖ్య
- ఉద్యోగాల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టించారని విమర్శ
తెలంగాణకు జాతీయ రహదారులను కేంద్రం ఇవ్వడంలో గొప్పేముందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ప్రశ్నించారు. నేషనల్ హైవేలు తెలంగాణ రాష్ట్ర హక్కు అని చెప్పారు. విభజన చట్టం, పార్లమెంటు ఆమోదం తర్వాతే రాష్ట్రానికి జాతీయ రహదారులు వచ్చాయని అన్నారు. కొన్ని సినిమాల ట్రైలర్లు ట్రైలర్లకే పరిమితమవుతాయని, సినిమాలుగా విడుదల కావని... బీజేపీ ట్రైలర్ కూడా అటువంటిదేనని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అత్యధిక అవార్డులు ఇచ్చిందని... ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధే లేదని మోదీ అంటున్నారని విమర్శించారు. ఇది మోదీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టించారని... ఇప్పుడు యూనివర్శిటీలో ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని అంటున్నారని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మోదీకి లేదని అన్నారు. బీజేపీలో 200 మంది రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు.