New Delhi: దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
- ఈ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపిలేని వర్షం
- మధ్యాహ్నం 2.30 గంటల వరకు 98.7 మిమీ వర్షపాతం
- లోతట్టు ప్రాంతాలు జలమయం... రోడ్లపైకి భారీగా నీరు
- నిలిచిపోయిన ట్రాఫిక్
- రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలయ్యాక తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్బర్ రోడ్, ప్రగతి మైదాన్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇండియా గేట్, నోయిడా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీటి పరిమాణం పెరుగుతుండడంతో మింట్ బ్రిడ్జి ప్రాంతంలో అండర్ పాస్ మూసివేశారు.
కాగా, ఈ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఢిల్లీలో 98.7 మిమీ వర్షపాతం నమోదైనట్టు గుర్తించారు. ఢిల్లీలో రేపు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు దేశ రాజధానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.