Pakistan: పాక్ జట్టు భారత్ కు వచ్చేదీ, లేనిదీ తేల్చనున్న హైలెవల్ కమిటీ
- అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్
- భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ విభేదాలు
- భారత్ లో పాక్ ఆడడంపై అనిశ్చితి
- హైలెవల్ కమిటీ వేసిన పాక్ ప్రధాని
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ విభేదాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే. ముఖ్యంగా, క్రికెట్లో ఇరుదేశాలు పరస్పరం సిరీస్ లు ఆడి పదేళ్లు కావస్తోంది. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఇరు జట్లు తలపడుతున్నాయి.
ఇప్పుడు భారత్ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ లోని వివిధ వేదికలపై వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, ఈ ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ రావడంపై పూర్తి స్పష్టత లేదు. దీనిపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు.
పాక్ జట్టు భారత్ లో అడుగుపెట్టేదీ, లేనిదీ ఈ కమిటీ సిఫారసులపై ఆధారపడి ఉంటుంది. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీకి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పాక్ క్రీడల మంత్రి అహసాన్ మజారీ, మరియమ్ ఔరంగజేబ్, అసద్ మహమూద్, అమిన్ ఉల్ హక్, కమర్ జమాన్ కైరా, మాజీ దౌత్యవేత్త తారిక్ ఫతామీ సభ్యులుగా ఉన్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను వివిధ కోణాల్లో పరిశీలించి ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టరాదన్నది పాక్ ప్రభుత్వ పంథా. ఈ నేపథ్యంలో, పాక్ జట్టును భారత్ పంపడం దాదాపు ఖాయమే అయినా, ఈ కమిటీ భారత్ లో తమ ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల భద్రతపై నిశితంగా చర్చించనుంది. దీనిపై కొన్ని సిఫారసులతో ఓ నివేదిక రూపొందించి ప్రధాని షేబాజ్ షరీఫ్ కు సమర్పించనుంది. ప్రధాని షేబాజ్ షరీఫ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఐసీసీ, ఇటు బీసీసీఐ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఎప్పుడో ప్రకటించేశాయి. పాక్ జట్డు ఆడే మ్యాచ్ ల వేదికలను కూడా ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు తప్పకుండా వస్తుందని ఐసీసీ, బీసీసీఐ భావిస్తున్నాయి.