Indian Railways: విద్యుదాఘాతంతో ఫలక్‌నుమా రైలు ప్రమాదం?.. క్లూస్ టీమ్ అనుమానం!
- ఎస్4 బోగిలోని టాయిలెట్‌లో విద్యుదాఘాతం జరిగినట్లుగా భావిస్తున్న క్లూస్ టీమ్
- నిమిషాల్లోనే మంటలు మిగతా బోగీలకు వ్యాప్తి
- వందకు పైగా నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు
ఫలక్‌నుమా రైలు అగ్ని ప్రమాద ఘటనకు విద్యుదాఘాతం కారణమని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎస్4 బోగిలోని టాయిలెట్ వద్ద విద్యుదాఘాతం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ ప్రారంభమైన మంటలు కొన్ని నిమిషాల్లోనే మిగతా బోగీలకు వ్యాపించినట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. ప్రమాదంలో కాలిపోయిన 5 బోగీలను క్లూస్ టీమ్ పరిశీలించి, వందకు పైగా నమూనాలను సేకరించి, వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్‌కు పంపించింది. నివేదిక వచ్చాక కచ్చితమైన కారణాలు తెలుస్తాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా ఓవర్ హీట్ కారణంగా మంటలు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.
బెంగాల్ లోని హౌరా నుండి సికింద్రాబాద్ వస్తోన్న ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి శివారులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. కానీ ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైల్వే శాఖకు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.