Swarnalatha: విశాఖ నోట్ల మార్పిడి కేసు.. సీఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు
- కానిస్టేబుల్ హేమసుందర్‌పైనా వేటు
- నిందితులు నలుగురికీ ఈ నెల 21 వరకు రిమాండ్
- స్వర్ణలత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, కానిస్టేబుల్ హేమసుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, వీరిద్దరితోపాటు హోంగార్డు వి.శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో నిన్న వారిని నగరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
స్వర్ణలత పెట్టుకున్న బెయిల్ దరఖాస్తు రేపు విచారణకు రానుంది. కాగా, ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వర్ణలత డ్యాన్స్‌లో శిక్షణ కోసం ఓ కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఆమె గురించి వార్తలు వచ్చిన తర్వాత ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.