Cancer Screening: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి భారీ స్పందన
- చిరంజీవి చొరవతో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు
- చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు వద్ద శిబిరం
- చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ సంయుక్త కార్యాచరణ
- ఉచిత క్యాన్సర్ పరీక్షలకు 2 వేల మంది రిజిస్టర్ చేయించుకున్న వైనం
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నేడు హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు వద్ద నిర్వహించారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. సినీ కార్మికులు, మెగా ఫ్యాన్స్, సినీ పాత్రికేయులు దాదాపు 2 వేల మంది వరకు ఈ క్యాంపులో ఉచితంగా పరీక్షలు చేయించుకునేందుకు తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ మన్నం పర్యవేక్షణలో నిపుణులైన వైద్య బృందం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డాక్టర్ గోపీచంద్ తో తమకు పాతికేళ్లుగా పరిచయం ఉందని, ఇప్పటికీ ఆయన అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తుండడం చూస్తుంటే తమకు ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. వైద్యులు మన కళ్లెదురుగా తిరిగే దేవుళ్లని నాగబాబు కొనియాడారు. ఓ సినిమా ఫెయిలైతే మరో సినిమా తీసుకునే అవకాశం ఉంటుందని, ఇంకేదైనా విషయంలో ఒకసారి విఫలమైతే మరోసారి ప్రయత్నించవచ్చని అన్నారు. కానీ, డాక్టర్ వృత్తి అలా కాదని, ఒక్కసారి ఫెయిలైతే ఇక చేయడానికేమీ ఉండదని స్పష్టం చేశారు.
డాక్టర్ వృత్తిలో తప్పు జరగకూడదని, అందుకే డాక్టర్లను తాను దేవుళ్లుగా భావిస్తానని తెలిపారు. ఎంతో శ్రమించి డాక్టర్లు ఓ పేషెంట్ ను బతికిస్తే... పోనీలేమ్మా, దేవుడి దయ వల్ల బతికాడు అంటారే గానీ, డాక్టర్ మీరే కదా బతికించారు అని ఒక్కరు కూడా అనరని వ్యాఖ్యానించారు. ఇక తదుపరి క్యాంపును వచ్చే నెలలో కరీంనగర్ లో నిర్వహిస్తామని వెల్లడించారు.