England: యాషెస్ లో ఇంగ్లండ్ గెలిచింది... నిలిచింది!

England wins third test and kept chances alive in Ashes against Aussies

  • మూడో టెస్టులో 3 వికెట్ల తేడాతో నెగ్గిన ఆతిథ్య ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆసీస్
  • 7 వికెట్లకు ఛేదించిన ఇంగ్లండ్
  • 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్
  • చివర్లో విలువైన పరుగులు చేసిన క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్
  • యాషెస్ లో ఆశలు సజీవంగా నిలుపుకున్న బెన్ స్టోక్స్ సేన 

బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆశలు నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో నేడు ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో ఓడిపోయుంటే ఇంగ్లండ్ సిరీస్ కోల్పోయి ఉండేది. ఎందుకంటే, ఇప్పటికే ఆసీస్ యాషెస్ సిరీస్ లో తొలి రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిస్తే ఐదు టెస్టుల సిరీస్ కాస్తా 3-0తో ఆసీస్ వశమయ్యేది. 

అయితే, సొంతగడ్డపై అమోఘమైన పోరాటపటిమ కనబర్చిన ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో నెగ్గి సిరీస్ లో ఆశలు సజీవంగా నిలుపుకుంది.  251 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి ఛేదించింది. యువ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ 75 పరుగులతో రాణించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

బ్రూక్ అవుటైనా, ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ 32, మార్క్ ఉడ్ 16 పరుగులతో రాణించి ఇంగ్లండ్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో మెరుగైన ప్రదర్శన నమోదు చేశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ కు 1, మిచెల్ మార్ష్ 1 వికెట్ లభించాయి. 

ఇంగ్లండ్ జట్టు తొలి రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచినప్పటికీ మ్యాచ్ లు ఓడిపోయింది. ప్రతిసారి ఆసీస్ కు బ్యాటింగ్  అప్పగించడం, లక్ష్యఛేదనలో తేలిపోవడం... ఇలా రెండు టెస్టుల్లో పరాజయం చవిచూసిన ఇంగ్లండ్... మూడో టెస్టులోనూ ఏమాత్రం తగ్గలేదు. టాస్ గెలిచి మరోసారి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. 

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 263 పరుగులు చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆలౌటైంది. అనంతరం, రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసిన ఆసీస్... ఇంగ్లండ్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే, గత రెండు టెస్టుల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న ఇంగ్లండ్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదన్న దృఢ వైఖరి కనబర్చింది. చివరి వరుస బ్యాట్స్ మెన్ కూడా గట్టిగా పోరాడడంతో విజయలక్ష్మి ఇంగ్లండ్ నే వరించింది. ఇక, ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జులై 19 నుంచి 23 వరకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరగనుంది.

  • Loading...

More Telugu News