Posani Krishna Murali: జగన్ ను ఓడించడం పవన్ వల్ల అయ్యేపనేనా?: పోసాని
- జగన్ పై అవాకులుచెవాకులు పేలొద్దంటూ పవన్ కు పోసాని వార్నింగ్
- జగన్ అవినీతికి పాల్పడ్డాడని ఒక్క ఆధారం చూపించు అంటూ సవాల్
- జగన్ ను గద్దె దించే బలం పవన్ కు లేదని స్పష్టీకరణ
సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ అదేపనిగా ఆరోపణలు చేస్తుండడం మానుకోవాలని ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి హితవు పలికారు. జగన్ అవినీతికి పాల్పడ్డాడని పవన్ ఒక్క ఆధారమైనా చూపించగలరా అని పోసాని సవాల్ విసిరారు.
అసలు, పవన్ కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని తాను అనుకోవడంలేదని, సీఎం జగన్ ను ఓడించడం పవన్ వల్ల అయ్యేపనేనా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్ ను గద్దె దించుతా అంటున్నాడని, వాస్తవానికి పవన్ కు అంత బలం లేదని పోసాని స్పష్టం చేశారు. పవన్ అంత శక్తిమంతుడే అయితే, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడని నిలదీశారు.
వయసు రీత్యా జగన్... పవన్ కంటే చిన్నవాడని, తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో పవన్ ఓర్వలేకపోతున్నాడని పోసాని విమర్శించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటున్న పవన్ కల్యాణే మొదట తిట్టడం ప్రారంభించారని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, పవన్ కాపులను కూడా మోసం చేస్తున్నాడని, కాపుల కోసం పదవులు త్యాగం చేసిన ముద్రగడ పద్మనాభంను తిట్టించడం పవన్ కు తగదని సూచించారు.