Northern India: ఉత్తరాదిన వరద బీభత్సం... 22కి పెరిగిన మృతుల సంఖ్య
- తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు
- హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పై భారీ ప్రభావం
- విరిగిపడుతున్న కొండచరియలు... పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు
- కొట్టుకుపోతున్న దుకాణాలు, కార్లు
నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు, కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మృతుల సంఖ్య 22కి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ లో 17 మంది మరణించగా.... యూపీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 5 మరణాలు నమోదయ్యాయి.
ముఖ్యంగా, గత రెండ్రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీలో వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకునిపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్ స్పాట్ కులూలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటనలు 14 నమోదు కాగా, 13 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలో 700 చోట్ల రోడ్లు మూసుకుపోయాయి.
జమ్మూ కశ్మీర్ లో వర్షం కొంత తగ్గడంతో, అమర్ నాథ్ యాత్ర కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.