Himachal Pradesh: వరదలో కొట్టుకుపోయిన వంతెన.. వీడియో ఇదిగో !
హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘటన
ఉత్తరాదిలో భారీ వర్షాలకు పలు బ్రిడ్జిల ధ్వంసం
ఉప్పొంగుతున్న బియాస్ నది.. హైవేల మూసివేత
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు బ్రిడ్జిలు ధ్వంసం కాగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిని దాటి అవతలి వైపు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భారీ ఇనుప వంతెన కూలి, వరద నీటిలో పడి కొట్టుకుపోయిన దృశ్యాలను ఓ యూట్యూబర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. బియాస్ నది వరదలతో తీరం కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మనాలిలో ఫ్లాష్ ప్లడ్స్ కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.