Supreme Court: మాకు అపారమైన శక్తి ఉంది.. కానీ..: మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court comments on petitions related to Manipur violence

  • మణిపూర్ లో ఇటీవల తీవ్ర హింస
  • 150 మందికి పైగా మృతి
  • జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు
  • శాంతిభద్రతల విషయం రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న సుప్రీంకోర్టు

మణిపూర్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల పట్ల దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది రాష్ట్ర ప్రభుత్వాల పని అని స్పష్టం చేసింది. 

మణిపూర్ లో రిజర్వేషన్లకు సంబంధించి కుకీ, మీయిటీ సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 150 మందికి పైగా బలయ్యారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో, మణిపూర్ లో అరాచక పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కుకీ తెగకు చెందిన పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ హింసను బీజేపీ భాగస్వామ్య రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కుకీల తరఫు న్యాయవాది కొలిన్ గొంజాల్వెజ్ ద్విసభ్య ధర్మాసనానికి విన్నవించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం పిటిషనర్ల వాదనలు విన్న అనంతరం, తమ అభిప్రాయాలు వెల్లడించింది. 

మణిపూర్ లో మరింత హింసను ఎగదోసే ఎలాంటి నిర్ణయాలకు సుప్రీంకోర్టును వేదికగా చేయలేమని సీజేఐ పేర్కొన్నారు. "సుప్రీంకోర్టు ఏం చేయగలదన్నదానిపై మాకు స్పష్టత ఉంది. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే చూసుకుంటాయి. ఇది మానవతా సంక్షోభమే. సుప్రీంకోర్టు శక్తి కూడా అపారమైనదే... కానీ ఇలాంటి విషయాల్లో మేం జోక్యం చేసుకోలేం. ఆ విషయంపై మేం పూర్తి స్పృహతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News