Rains: ఏపీలో 'నైరుతి' జోరు... రెండ్రోజుల పాటు వర్షాలు
- రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- గడచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో వానలు
- నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
- ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో అనేక జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైంది. కాగా నేడు, రేపు కూడా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీని ఉటంకిస్తూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, పల్నాడు, అన్నమయ్య, శ్రీకాకుళం, బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అదే సమయంలో విజయనగరం, నెల్లూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వెల్లడించింది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.