Bus Accident: దర్శి ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఆర్టీసీ
- పొదిలి నుంచి కాకినాడ వెళుతున్నపెళ్లి బస్సు
- దర్శి సమీపంలో సాగర్ కాలువలో పడిపోయిన వైనం
- ఏడుగురి మృతి... 12 మందికి గాయాలు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
- క్షతగాత్రులకయ్యే వైద్య ఖర్చులు భరిస్తామన్న ఆర్టీసీ ఈడీ
వివాహవేడుక ముగించుకుని రిసెప్షన్ కోసం పొదిలి నుంచి కాకినాడ వెళుతున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది.
ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో పెళ్లి బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయారు. దాంతో అదుపుతప్పిన బస్సు సాగర్ కెనాల్ వాల్ ను ఢీకొట్టి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.
కాగా, పెళ్లి బృందం కాకినాడకు వెళ్లేందుకు ఆర్టీసీ ఇంద్ర బస్సును అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు భరిస్తామని ఆర్టీసీ ఈడీ పేర్కొన్నారు.