Pawan Kalyan: కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడగలవా.. మక్కెలిరగ్గొడతారు!: పవన్ కల్యాణ్‌పై రోజా ఫైర్
- ఓ మహిళగా ఆ మాట తనకు నచ్చలేదన్న రోజా
- వాలంటీర్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్
- నీ అభిమానుల కోసం ఏం చేశావని ప్రశ్నించిన మంత్రి
- బాలకృష్ణ అలగాజనం అంటే ఆయన ఇంటర్వ్యూకి వెళ్తావా? అని నిలదీత
వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా మంగళవారం మండిపడ్డారు. జనసేనాని చేసిన వ్యాఖ్యల్లో వుమెన్ ట్రాఫికింగ్ అనే ఆరోపణ తనకు నచ్చలేదన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై ఈ వ్యాఖ్యలు చేస్తే ఓ మహిళగా తాను సహించనన్నారు.
ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... పవన్, చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని స్పష్టంగా అర్థమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారివల్ల వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు రావడం జీర్ణించుకోలేక మూడు రోజులుగా పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
వాలంటీర్లను ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళలు అన్నా.. వాలంటీర్లు అన్నా జనసేనానికి ఏమాత్రం గౌరవం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటి వరకు జగన్ ను చూసి మాత్రమే పవన్, చంద్రబాబులు వణుకుతున్నారని అనుకున్నానని, ఇప్పుడు వాలంటీర్లను చూసి కూడా భయపడుతున్నారని అర్థమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్ముతున్నారని, వారి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే వాలంటీర్లే నీ సంగతి తేలుస్తారని హెచ్చరించారు.
ఆడవాళ్ల అక్రమ రవాణా అనడం దారుణమని, అంటే వుమెన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు ఉద్యోగం చేస్తున్నారా? అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నారన్నారు. పవన్ మాటలు సిగ్గుచేటన్నారు. పవన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాటికి కూడా క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం వుమెన్ ట్రాఫికింగ్ లో టాప్ 10లోనే ఏపీ లేదని, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని, అక్కడకు వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించగలవా? అని నిలదీశారు. 'కేసీఆర్ ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా...? మాట్లాడితే నీ మక్కెలు ఇరగ్గొడతారు.. హైదరాబాద్ లో బతకలేనని అక్కడ మాట్లాడవు' అని దుయ్యబట్టారు.
తన భార్యను, తల్లిని, పిల్లల్ని వైసీపీ తిడుతోందని చెబుతున్నావని, కానీ 2018లో నీవు చేసిన ట్వీట్ చూసుకోవాలని, టీడీపీ పెద్దలే మీ కుటుంబాన్ని తిట్టారన్నారు. తనపై కొన్ని ఛానల్స్ నిరంతరంగా విమర్శలు చేస్తున్నాయని ట్వీట్ చేశావని, మరి ఆ తర్వాత ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించారు. వారాహిని అమ్మవారు అంటూ చెప్పులు వేసుకొని ఉంటావా? అని నిలదీశారు.
అసలు జనసైనికుల కోసం ఏం చేస్తున్నావో చెప్పాలన్నారు. నీ అభిమానులను, నీ కోసం పని చేసే వారిని బాలకృష్ణ అలగాజనం అని తిట్టిపోశారని, కానీ ఆయన ఇంటర్వ్యూకు పిలిస్తే ఎలా వెళ్లావని ప్రశ్నించారు. నీ ప్యాకేజీ కోసం, నీ తల్లిని.. నీ కుటుంబాన్ని.. నీ జనసైనికులను తిట్టిన వారిని వెనకేసుకొస్తున్నావ్ అన్నారు.
జగన్ ను గౌరవించనని చెబుతున్నావని, ఆయనను అనే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడైనా నీ కుటుంబాన్ని విమర్శించాడా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వెలుగు చూసినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ఈ విషయమై తాను ఫైట్ చేస్తే తనను రూల్స్ విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో నీ నోరు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నిండిందా? అని ఎద్దేవా చేశారు.
నిత్యం విప్లవం అని మాట్లాడే పవన్ కనీసం గంట సేపు ధర్నా, నిరసన కూడా చేయలేడన్నారు. వాలంటీర్ వ్యవస్థను చూసి విదేశాలే అమల్లోకి తెస్తున్నాయన్నారు. వాలంటీర్లకు పాదాభివందనం చేయాల్సింది పోయి.. వుమెన్ ట్రాఫికింగ్ అంటూ విమర్శలు చేస్తావా? అన్నారు. ఒక్కసారి మీ డేటా ఎవరికి ఇస్తున్నారని మహిళలను అడిగితే.. పవన్ ను పొరకతో కొడతారన్నారు.
జగన్ ను ఏకవచనంతో పిలుస్తాను.. గౌరవించనని చెబుతున్నావని, నీ బోడి గౌరవం ఎవరికి కావాలన్నారు. ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. నీలాంటి వాడి అవసరం లేదన్నారు. జగన్ 36 ఏళ్లకే ఎంపీ అయ్యారని, 38 ఏళ్లకే రికార్డ్ స్థాయి ఓట్లతో రెండోసారి ఎంపీగా గెలిచారని గుర్తు చేశారు. నువ్వు కూడా అలా గెలిచి రా.. అప్పుడు దమ్మున్నోడివి అవుతావన్నారు.