ECE: దొంగ ఓట్ల ఫిర్యాదుల వేళ.. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీఐ పిలుపు
- ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయని ఆరోపణలు
- ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశం
- ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌స్థాయి అధికారులతో ఇంటింటి తనిఖీ
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.