Posani Krishna Murali: భీమవరంలో పవన్ గెలిచేవాడే కానీ, ఎందుకు ఓడిపోయాడంటే..: పోసాని
- పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదన్న పోసాని
- జనసేనానికి ఓటేయ వద్దంటూ టీడీపీ రూ.15 కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపణ
- నమ్మకం లేకుంటే విచారించుకోవాలని పవన్ కు సలహా
భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోయే అవకాశమే లేదని, అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని జనసేనానికి పోసాని కృష్ణ మురళి హితవు పలికారు. పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదని తేల్చిచెప్పారు. భీమవరంలో రూ.15 కోట్లు ఖర్చు పెట్టి మరీ పవన్ కు ఓటేయ వద్దంటూ టీడీపీ ప్రచారం చేసిందని పోసాని ఆరోపించారు.
ఈ విషయంపై కావాలంటే ఎంక్వైరీ చేయిస్తే నిజం నీకే తెలుస్తుందని పవన్ కల్యాణ్ కు సూచించారు. పవన్ నమ్మే నేతలు ఆయనను ఎన్నటికీ ముఖ్యమంత్రిని చేయరని పోసాని చెప్పారు. పొరపాటున పవన్ ముఖ్యమంత్రి అయితే అందరూ కలిసి ఇలాగే ప్రెస్ మీట్ లు పెట్టి తిడతారని చెప్పారు.
ఆరోపణలు చేయడంలో తప్పులేదని, అయితే ఆరోపణలు చేయడానికి తగిన ఆధారాలు చూపాలని పోసాని కృష్ణ మురళి జనసేనానికి హితవు పలికారు. ఇప్పుడు తాను పెట్టిన ప్రెస్ మీట్ పైనా ఆరోపణలు చేయొచ్చన్నారు. పోసాని డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్లు పెడతాడని ఆరోపించవచ్చు.. అయితే, నేను ఎవరి దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాననే వివరాలు కూడా చెప్పాలన్నారు.
వేల మంది అమ్మాయిలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, పవన్ రాజకీయ జీవితానికి కూడా మంచిది కాదని పోసాని చెప్పారు. పొరపాట్లు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ చేసిన పొరపాటు గుర్తించి క్షమాపణ చెప్పడం హుందాతనమని వివరించారు.