Team India: నేటి నుంచే భారత్–వెస్టిండీస్ తొలి టెస్టు.. వర్షం ముప్పు తప్పదా?
- రాత్రి 7.30 నుంచి డొమినికాలో మ్యాచ్ ప్రారంభం
- రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి భారత్
- యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వచ్చే అవకాశం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో వరుసగా రెండోసారి ఓడిపోయిన భారత్.. నెల విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది. 2023–2025 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ లో మొదటగా వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో తలపడనుంది. ఈ రోజు నుంచి విండీస్ తో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మతో యశస్వి ఓపెనింగ్ చేసే అవకాశం ఉండగా.. వేటు పడ్డ పుజారా స్థానంలో మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశం కనిపిస్తోంది.
వికెట్ కీపర్‌గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్‌తో ఇషాన్ కిషన్ పోటీపడుతున్నాడు. మరోవైపు తొలి టెస్టు కోసం క్రెయిగ్ బ్రాత్ వైట్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ జట్టులోనూ పలువురు కొత్త వాళ్లకు అవకాశం దక్కింది. ఇక అంతా బాగానే ఉన్నా ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు కనిపిస్తోంది. వాతావరణ సూచనల ప్రకారం మ్యాచ్ తొలి, ఐదో రోజుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. డొమినికాలో 27 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా.. గంటకు సుమారు 30 కి.మీ వేగంతో గాలి వీస్తుంటుంది. కాస్త చల్లటి గాలులు ఆటగాళ్లకు సవాల్ గా మారనున్నాయి.