Chandrababu: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదన్న చంద్రబాబు
- వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్రోహమని వ్యాఖ్య
- తామొస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్లను పరిమితం చేస్తామని వెల్లడి
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహమని, దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలు వినియోగించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదని అన్నారు.
దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. ‘‘పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. ఓట్ల అవకతవకలపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతాం” అని వెల్లడించారు.