online wedding: హిమాచల్ వరదలు.. వరుడు ఒకచోట.. వధువు ఇంకోచోట.. ఆన్‌లైన్‌లో కలిపారు ఇద్దరినీ!
- హిమాచల్‌లో ఎడతెరిపిలేని వానలు
- రోడ్లు తెగిపోవడంతో పెళ్లి మండపానికి చేరుకోలేని పరిస్థితులు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేసిన పెద్దలు
ఎడతెరిపి లేని వర్షాలు.. ఆకస్మిక వరదలు.. ఉప్పొంగుతున్న నదులు.. విరిగిపడుతున్న కొండ చరియలు.. కొట్టుకుపోయిన రోడ్లు.. కూలిపోయిన ఇళ్లు.. కొన్ని రోజులుగా ఉత్తరాదిలో నెలకొన్న పరిస్థితి ఇది. జన జీవనం స్తంభించిపోయింది.
ఈ ప్రకృతి విపత్తు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కటి అవుదామనుకున్న వధూవరులకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఈనెల 10న షిమ్లాలోని కోట్‌గఢ్‌కు చెందిన వరుడు ఆశిశ్ సిన్హా.. భుంటార్‌లోని కుల్లుకు చెందిన శివానీ ఠాకూర్ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలతో వధూవరులు పెళ్లి మండపానికి చేరుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివాహ వేడుకను ఆన్‌లైన్‌లో జరిపించాలని నిర్ణయించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేశాయి. ఈ ఆన్‌లైన్ పెళ్లిలో మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఆగిపోకుండా, బంధువులందరినీ పిలిపించి రిస్క్ చేయకుండా వేడుక నిర్వహించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.