tomato: 2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు
- 40 ఎకరాల్లో నిత్యావసర కూరగాయలు పండిస్తున్న ప్రభాకర్, సోదరులు
- రెండేళ్ల క్రితం ఒక్కో బాక్సును గరిష్ఠంగా రూ.800కు విక్రయించినట్లు వెల్లడి
- ఈసారి రూ.1,900కు విక్రయించిన రైతు
కొన్ని రోజులుగా టమాటా ధరలు అంతకంతకూ పెరుగుతూ ఆయా ప్రాంతాల్లో కిలో రూ.100 నుండి రూ.200 పైకి చేరుకుంది. పెరుగుతున్న టమాటా ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు ఈ పంట వేసిన రైతుల పంట పండుతోంది. టమాటా ధర భారీగా పెరగడంతో కర్ణాటకలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ రైతు ఏకంగా లక్షలు సంపాదించాడు.
కోలార్ ప్రాంతానికి చెందిన రైతు ప్రభాకర్ గుప్తా, అతని సోదరులకు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఎక్కువగా నిత్యావసర కూరగాయలు పండిస్తుంటాడు. ఇప్పుడు 2,000 టమాటా బాక్సులను అమ్మి ఏకంగా రూ.38 లక్షలు ఆర్జించాడు. ఒక్కో టమాటా బాక్సును రూ.1,900కు విక్రయించాడు.
నలభై ఏళ్లుగా తన 40 ఎకరాల పొలంలో టమాటా సాగు చేస్తున్నానని రైతు ప్రభాకర్ గుప్తా చెప్పాడు. టమాటా ధరలు ఎన్నోసార్లు పెరిగినప్పటికీ, ఇంత మొత్తం మాత్రం మొదటిసారి వచ్చినట్లు చెప్పాడు. రెండేళ్ల క్రితం 15 కిలోల టమాటా కలిగిన ఓ బాక్సును రూ.800కు విక్రయించానని, ఇప్పుడు ఏకంగా రూ.1,900 పలికిందన్నాడు. టమాటా రిటైల్ మార్కెట్లో కిలో రూ.126 కంటే ఎక్కువగా ఉందని చెప్పాడు.