Team India: సూపర్ మ్యాన్ సిరాజ్.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన పేసర్
- వెస్టిండీస్ తో తొలి టెస్టులో ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నహైదరాబాదీ
- బ్లాక్ వుడ్ క్యాచ్ ను డైవ్ చేస్తూ అందుకున్న వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
వెస్టిండీస్ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్ హవా నడిచింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకే వికెట్ తీసినా తన సూపర్ ఫీల్డింగ్ తో అతను వార్తల్లో నిలిచాడు. సూపర్ మ్యాన్ ను తలపించిన ఫీల్డింగ్ తో అతను ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. 28వ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని జెర్మైన్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ దిశగా గాల్లోకి లేపాడు.
దూరం నుంచి పరుగెత్తుకు వచ్చిన సిరాజ్ గాల్లోకి అమాంతం ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. బంతిని అందుకున్న తర్వాత బ్యాలెన్స్ కోల్పోయిన అతను కింద పడగా.. మోచేతికి చిన్న గాయం కూడా అయింది. సాధారణంగా బౌలర్లు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఇలాంటి డైవింగ్ క్యాచ్ లు పట్టడం చాలా అరుదు. గాయాలు అవుతాయని వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఎంతో ధైర్యంగా ఈ క్యాచ్ పట్టిన సిరాజ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.