Pawan Kalyan: షర్మిల పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదన్న పవన్
- సైద్ధాంతిక బలం ఉంటేనే పార్టీ నడపగలమని వ్యాఖ్య
- అధికారంలోకి రావాలని అనుకుంటే తాను అప్పుడే కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడినని వెల్లడి
షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని అన్నారు. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే కుదరదని చెప్పారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో జనసేన వీర మహిళలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు.
‘‘ఏపీ ముఖ్యమంత్రి గారి చెల్లెలు అప్పట్లో పార్టీని ప్రారంభించారు. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నేను ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పాను. అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారని ఈ మధ్య వింటున్నాం. అయితే అది తప్పో, ఒప్పో నేను చెప్పట్లేదు. కానీ.. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదు.. సైద్ధాంతిక బలం ఉంటేనే నడపగలం. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే నేను అప్పుడే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయే వాడిని. సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే.. చచ్చే వరకు పోరాడాలి” అని అన్నారు.