Ram Gopal Varma: 'శివ' సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా పూరీ జగన్నాథ్... ఫొటో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ
- దర్శకుడిగా వర్మకు తొలి చిత్రం శివ
- 1989లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం
- తర్వాత కాలంలో పూరీ జగన్నాథ్ అద్భుతమైన దర్శకుడిగా ఎదిగాడన్న వర్మ
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో, హైదరాబాద్ రౌడీయిజం ప్రధాన అంశంగా తెరకెక్కి, తెలుగు నాట అద్భుత విజయం సాధించిన చిత్రం శివ. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ఇది తొలి చిత్రమే అయినా, ఆయన కెరీర్ కు సంచలన ఆరంభాన్నిచ్చింది.
మరోవైపు, నాగార్జున ఇమేజ్ ను అమాంతం మలుపు తిప్పి, ఆయన సినీ ప్రస్థానం శివకు ముందు, శివకు తర్వాత అనేలా పరిస్థితిని మార్చివేసింది. ఈ చిత్రం 1989లో వచ్చింది. ఇప్పటికీ తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల జాబితాలో శివ కచ్చితంగా ఉంటుంది. కథ, కథనం, నటన, సాంకేతిక విలువలు, సంగీతం... ఇలా ఎలా చూసినా శివ టాలీవుడ్ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది.
కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు శివ సినిమా గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. ఇది కూడా శివ చిత్రానికి సంబంధించినదే.
నాగార్జున ఆవేశంగా నడిచి వస్తుండగా, వెనుకగా ఓ కుర్రాడు కూడా అనుసరిస్తుంటాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు పూరీ జగన్నాథే అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఆ రోజు సెట్స్ పై ఉన్న పూరీ జగన్నాథ్ ను బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా ఉపయోగించుకున్నామని వివరించారు. ఆ తర్వాత కాలంలో పూరీ జగన్నాథ్ నిజంగా అద్భుతమైన రీతిలో ఎదిగాడని వర్మ కొనియాడారు.
వాస్తవానికి పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీకి వచ్చింది నటుడు అవ్వాలనే. కానీ ఆయన నటుడు కాలేకపోయారు. వర్మ వద్ద దర్శకత్వ విభాగంలో చేరి 'బద్రి'తో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. సినీ దర్శకుడిగా ప్రస్థానం ఆరంభించకముందు, దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం కోసం కొన్ని కార్యక్రమాలు కూడా రూపొందించారు.
అన్నట్టు... చిరంజీవి గాఢ్ ఫాదర్ చిత్రంలో పూరీ జగన్నాథ్ ఓ చిన్న రోల్ పోషించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, తాను సినిమా ఇండస్ట్రీకి నటుడు అవ్వాలని వచ్చిన విషయాన్ని పూరీ జగన్నాథ్ అందరితో పంచుకున్నారు.