yamuna river: మహోగ్ర యమున.. ఎర్రకోటను తాకిన వరద!
- ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది
- ఢిల్లీలో 45 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరదలు
- ఎర్రకోట చుట్టూ నీళ్లతో నిండిపోయిన రోడ్లు
యమునా నది ప్రమాదకర స్థాయిని మించి మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఢిల్లీని ముంచెత్తుతోంది. 45 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరదలకు దేశ రాజధాని వీధులు నదిలా మారాయి. లోతట్టు ప్రాంతాలే కాదు.. ప్రధాన రోడ్లు, ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి.
ఢిల్లీలోని చారిత్రక కట్టడం ‘ఎర్ర కోట’ను కూడా వరద నీళ్లు తాకాయి. యమునా ఘాట్ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ అంత దూరం వరద నీళ్లు వచ్చాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇంత దూరం వస్తాయని ఊహించని స్థానికులు.. ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట చుట్టూ ఉండే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట దాకా వచ్చిన వరద.. ఇంకెంత దూరం పోతుందనేది ఆందోళనకరంగా మారింది.
ఎర్రకోట వరకు యమునా నది నీళ్లు రావటం 45 ఏళ్లలో ఇదే తొలిసారి. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించటం కూడా ఇదే మొదటిసారి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నదిలోకి వరద పోటెత్తటంతో ఈ పరిస్థితి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ఈ ఉదయం ఏడు గంటలకు హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీలో యుమున నది 208.46 మీటర్ల స్థాయికి చేరుకుంది. ప్రమాద స్థాయికి మూడు మీటర్ల పైన ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆరు, ఏడుగుల వరకు నీళ్లు వచ్చాయి. పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది.కరెంట్ నిలిపివేశారు.