yamuna river: కేజ్రీవాల్ ప్రభుత్వంపై గౌతమ్ గంభీర్ విమర్శలు
- యమునా నది నీటి మట్టం పెరగడంతో నీట మునిగిన ఢిల్లీ వీధులు
- ఢిల్లీవాసులారా మేల్కొండి అంటూ గంభీర్ ట్వీట్
- ఉచితం అనుకుంటే మూల్యం చెల్లించుకుంటారని సూచన
యమునా నది నీటి మట్టం అనూహ్యంగా పెరగడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.... అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ క్రికెటర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నగరం మురికి కాలువలా మారిందని, ప్రజలు తమకు ఏదీ ఉచితంగా రాదని గుర్తించాలని, అభివృద్ధిని పక్కన పెట్టి అన్నీ ఉచితమని వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు.
'ఢిల్లీవాసులారా మేల్కొండి. ఢిల్లీ అధ్వానంగా తయారయింది. ఏదీ ఉచితం కాదు. అలా అనుకుంటే ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది' అని ఈస్ట్ ఢిల్లీ ఎంపీ ట్వీట్ చేశారు. ప్రజలకు ఉచితాలు అంటూ చెబుతున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో వరదల పరిస్థితికి కేజ్రీవాల్ ప్రభుత్వం కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్వహణ లోపం, సన్నాహక లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. యమునా నీటి మట్టం ఎన్నడూ లేనంతగా పెరిగిందని, ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రాధాన్యత అని ప్రభుత్వం చెబుతోంది. వరదల ధాటికి ముఖ్యమంత్రి నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపంలోని వీఐపీ జోన్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి.
గత రెండు రోజులుగా ఉత్తరాదిన భారీ వర్షాలు కురవడంతో హర్యానా బ్యారేజీ నుండి నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల సామర్థ్యాన్ని తగ్గించడంలో కేజ్రీవాల్ కేంద్రం జోక్యాన్ని కోరారు. అయితే బ్యారేజీకి భారీ వరద నీరు నేపథ్యంలో అదనపు నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.