Yashasvi Jaiswal: విండీస్‌తో తొలి టెస్టు.. ఒక్క సెంచరీతో బోల్డన్ని రికార్డులు రాసిన యశస్వి జైస్వాల్
- పదేళ్ల తర్వాత అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి లెఫ్ట్ హ్యాండర్
- తొలి మ్యాచ్‌లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడైన నాలుగో ఇండియన్
- విండీస్‌పై తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన మూడో ఇండియన్
- రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 312/2
- సెంచరీ బాది అవుటైన రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో రోసోలోని విండ్‌సోర్ పార్కులో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 215 బంతుల్లో సెంచరీ సాధించిన యశస్వి అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పదేళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లోనే శతకం నమోదు చేసిన రెండో లెఫ్ట్ హ్యాండర్, ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. మార్చి 2013లో ఆస్ట్రేలియాపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ 187 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ ఎడమచేతి వాటం బ్యాటర్ తన తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించడం విశేషం.
అంతేకాదు, విండీస్‌పై అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన మూడో బ్యాటర్ కూడా యశస్వినే. అంతకుముందు 2013లో కోల్‌కతాలో రోహిత్‌శర్మ(177), 2018లో రాజ్‌కోట్‌లో పృథ్వీషా (134) సెంచరీలు నమోదు చేశారు. యశస్వి ఇప్పుడు వారి సరసన చేరాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా యశస్వి తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఘనత సాధించాడు. ప్రస్తుతం అతడి వయసు 21 సంవత్సరాల 196 రోజులు.
అంతకుముందు పృథ్వీషా (18 సంవత్సరాల 329 రోజులు), అబ్బాస్ అలీ బేగ్ (20 సంవత్సరాల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (20 సంవత్సరాల 276 రోజులు) ఉన్నారు. యశస్వి తర్వాతి స్థానంలో అజారుద్దీన్ ఉన్నాడు. అజర్ 21 సంవత్సరాల 327 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. కాగా, రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 143, విరాట్ కోహ్లీ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ 103 పరుగులు చేసి అవుట్ కాగా, శుభమన్ గిల్ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.