Vanramchhuanga: అమిత్ షా, బీరేన్‌సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడిన మిజోరం బీజేపీ వైస్ ప్రెసిడెంట్
- బీజేపీకి వన్‌రామ్‌చువంగా రాజీనామా
- మణిపూర్ ఘర్షణలతో మనస్తాపం
- బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీయేనని ఇప్పుడు నమ్ముతున్నానంటూ లేఖ
మిజోరంలో బీజేపీకి షాక్ తగిలింది. పొరుగు రాష్ట్రం మణిపూర్‌లో జరుగుతున్న జాతుల మధ్య వివాదంలో క్రైస్తవ సమాజం పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్.వన్‌రామ్‌చువంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మిజోరం బీజేపీ చీఫ్ వన్లాల్హ్ముకాకు లేఖ రాశారు. మణిపూర్‌లో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలపై తాను తీవ్రంగా కలత చెందినట్టు అందులో పేర్కొన్నారు. 357 చర్చ్‌లు, పాస్టర్ క్వార్టర్లు, చర్చలకు చెందిన కార్యాలయాలను మెయిటీ తెగ మిలిటెంట్లు కాల్చి బూడిద చేశారని ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధితులను, క్రైస్తవులను కాపాడడంలో వీరిద్దరూ తీవ్రంగా విఫలమయ్యారని మండిపడ్డారు. అమిత్ షా మూడు రోజులపాటు మణిపూర్‌లో పర్యటించినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు తెరపడలేదన్నారు.
ఇంత జరుగుతున్నా ఈ ఘటనలను ఖండించడం కానీ, బాధితులను పరామర్శించడానికి కానీ మన దేశనాయకుడికి తీరిక లేకుండా పోయిందని, మౌనంగా చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అంటే గతంలో తాను నమ్మలేదని, కానీ ఇప్పుడు నమ్ముతున్నానని పేర్కొన్నారు. తన హోదాతోపాటు పార్టీని కూడా విడిచిపెట్టడం తన నైతిక బాధ్యత అని.. అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన వివరించారు.