Ambati Rambabu: పవన్ ను దగ్గర్నుంచి చూసినవాళ్లెవరూ ఆయనతో ఎక్కువకాలం ఉండలేరు: అంబటి రాంబాబు
- పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అంటూ అంబటి ఫైర్
- నోటికొచ్చినట్టు మాట్లాడడం పవన్ కు అలవాటేనని వ్యాఖ్య
- సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి మండిపడ్డారు. మిస్టర్ గాలి కల్యాణ్, వాలంటీర్ల పట్ల నీకేంటి అభ్యంతరం? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని అన్నారు.
పవన్ ను దగ్గర్నుంచి చూసిన వారెవరూ ఆయనతో ఎక్కువ కాలం ఉండలేరని, మరిశెట్టి రాఘవయ్య వంటి ప్రముఖ వ్యక్తి కూడా అలాగే దూరం అయ్యారని వెల్లడించారు. అందుకు కారణం.... పవన్ కల్యాణ్ లోని మల్టిఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని తెలిపారు.
"పవన్ గురించి సినిమాల్లో ఉన్నవాళ్లే నాకు ఓ విషయం చెప్పారు. ఓ గదిలో షూటింగ్ జరుగుతుంటే.. నాకేదో నెగెటివ్ ఎనర్జీ తగులుతోందయ్యా అంటాడట. అక్కడే ఉన్న ఓ పచ్చ చొక్కా వ్యక్తిని చూపించి అతడు నన్ను చంపడానికి వచ్చినట్టున్నాడు అని చెబుతాడట. దాంతో బౌన్సర్లను పిలిపించి ఆ వ్యక్తిని అక్కడ్నించి పంపించివేయాల్సి వచ్చిందట. మళ్లీ ఆ పచ్చ చొక్కా వ్యక్తి కనబడగానే నమస్కారం బాబూ, బాగున్నావా? అంటాడట. మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఇదే" అని అంబటి రాంబాబు వివరించారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పవన్ కల్యాణ్ కు అలవాటని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ ను పంచెలూడదీసి కొడతానన్నాడని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తుండడంతో, పవన్ రాజకీయాలకు పనికిరాడని ప్రజలు భావిస్తున్నారని అంబటి వివరించారు.
పవన్ కాపులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ ఏనాడూ మాట మీద నిలబడింది లేదని, పైగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ సంస్కారం గురించి నీతులు చెబుతున్నాడని విమర్శించారు. పవన్ లాంటి వ్యక్తి సంస్కారం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.