Gold Jewellery: కొన్ని రకాల బంగారు ఆభరణాలు, వస్తువుల దిగుమతికి కేంద్రం నూతన విధానం
- బంగారు ఆభరణాల దిగుమతికి ఇక మీదట లైసెన్స్
- కేంద్రం లైసెన్స్ జారీ చేస్తేనే దిగుమతులకు మార్గం సుగమం
- ఆ మేరకు నిబంధనలు సవరించిన డీజీఎఫ్ టీ
అత్యవసరం కాని వస్తువుల దిగుమతిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొన్ని రకాల బంగారు ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై ఆంక్షలు విధించింది. ఇకపై బంగారు ఆభరణాలు, అత్యవసర వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అందుకోసం కేంద్రం జారీ చేసే దిగుమతి లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, యూఏఈ నుంచి దిగుమతులపై ఈ ఆంక్షలు వర్తించవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) వెల్లడించింది. భారత్, యూఏఈ మధ్య వాణిజ్య ఒప్పందం ఉన్నందున ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది.
తాజా దిగుమతుల విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని డీజీఎఫ్ టీ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఇండోనేషియా నుంచి భారత్ కు భారీగా బంగారం దిగుమతులు పెరిగినట్టు కేంద్రం గుర్తించింది.
వాస్తవానికి భారత్ కు బంగారం ఎగుమతి చేసే దేశాల్లో ఇండోనేషియా లేదు. అయితే గత కొన్ని నెలల వ్యవధిలోనే నగల వ్యాపారులు ఇండోనేషియా నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా 3-4 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. విధానపరమైన ఓ లొసుగు వల్ల ఈ దిగుమతులపై పన్నులేవీ వసూలు చేయలేని పరిస్థితి నెలకొంది. సవరించిన దిగుమతుల విధానంతో ఇకపై పన్నుల రూపేణా కేంద్రానికి భారీ ఆదాయం లభించే అవకాశాలున్నాయి.