Chandrababu: మహాశక్తి అనే పదం నా మనసులోంచి వచ్చింది: చంద్రబాబు
- టీడీపీ జాతీయ కార్యాలయంలో మహాశక్తి పథకాలపై సదస్సు
- మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించిన చంద్రబాబు
- మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలేనని ఉద్ఘాటన
- మహిళల స్థితిగతులను మహాశక్తి ద్వారా మార్చేస్తామని స్పష్టీకరణ
టీడీపీ పాలనతోనే రాష్ట్రంలో మహిళా సంక్షేమం సాధ్యమైందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు... తెలుగుదేశం ఆవిర్భావం తరవాత అని చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో మహాశక్తి పథకాలపై సదస్సు నిర్వహించారు. సభ అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్రను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
"నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే. ఆవిర్భావం నాటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. నేడు మహాశక్తి తీసుకొస్తున్నా. మహాశక్తి పదం నా మనసులో నుంచి వచ్చింది. రాష్ట్రంలోని మహిళల స్థితిగతులను మహాశక్తి కార్యక్రమం ద్వారా మార్చేస్తాం. ఆనాడు 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆ తర్వాత కాలంలో ఆస్తి హక్కును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఆడపిల్లలకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే చాలనుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి విద్యను ప్రోత్సహించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను కండక్టర్లుగా నియమించాం. ఇప్పుడైతే ఏకంగా బస్సులు నడిపే శక్తి మహిళలకు వచ్చేసింది. ఆలోచనల పరంగా మహిళలే అత్యంత శక్తిమంతులని శాస్త్రీయంగానూ నిరూపితమైంది. నేడు ఐటీలో చూడండి. భర్త కంటే భార్యకే ఎక్కువ జీతం వస్తోంది. మన ఇళ్లలో గమనిస్తే కొడుకు కంటే కోడలికే ఎక్కువ జీతం వస్తుంది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
"జగన్ చెప్పినట్లు ఒక బిడ్డకే అమ్మఒడి కింద రూ. 15 వేలు ఇచ్చి ఆ బిడ్డనే చదివిస్తే మరో బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ తల్లి ఒప్పుకుంటుందా? అందుకే తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి ఒక్కొక్కరికి రూ. 15 వేలు ఇస్తాం. ఆడబిడ్డ పుడితే భారమని భావించే రోజుల్లోనే చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం పెట్టి రూ. 5 వేలు వారి పేరుతో డిపాజిట్ చేశాం. తద్వారా ఆడబిడ్డలకు అండగా నిలిచాం. ఆ తర్వాత ఆ సాయం వారి చదువుకు ఉపయోగపడింది. ప్రతిభా భారతిని మహిళా స్పీకర్ చేశాం.
నా చిన్నతనంలో నా తల్లి వంటింట్లో పడిన ఇబ్బందులు చూశా. దీపం పథకం తెచ్చి మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర చూసి మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరకు పోయే స్థితి వచ్చింది. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే మహాశక్తి కార్యక్రమం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. పసుపు కుంకుమ కింద రూ.10 వేల కోట్లు ఆర్థిక సాయం చేశాం. మహిళలకు 11 రకాల ఆరోగ్య పరీక్షల కోసం ఆర్థిక సహాయం చేశాం. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా ఆలోచించి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయించిన ఘనత టీడీపీది.
‘అమృత హస్తం’ కింద గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం....బేబీ కిట్లు, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతం, సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుకలు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది. మహాశక్తి పథకంలో భాగంగా ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం. విద్యను ప్రోత్సహించేందుకే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇక ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వారికి నెలకు రూ.1500 నేరుగా ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ ఈ పథకం అమలు అవుతుంది. సంపద సృష్టించే మంత్ర దండం టీడీపీ" అని చంద్రబాబు నాయుడు అన్నారు.