Yashaswi Jaiswal: డబుల్ సెంచరీ సాధించకుండానే వెనుదిరిగిన జైస్వాల్
- వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్టు
- ఆటకు నేడు మూడో రోజు
- 171 పరుగులు చేసి అవుటైన జైస్వాల్
- రోహిత్ శర్మ 103 పరుగులు
- భారీ ఆధిక్యం దిశగా భారత్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్ తో తొలి టెస్టులో అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మూడో రోజు ఆటలో డబుల్ సెంచరీ అందుకుంటాడని భావించగా, 171 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై నిరాశగా వెనుదిరిగాడు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జాషువా డ సిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఏమంత పసలేని విండీస్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో దూకుడైన బ్యాటింగ్ తో అలరించిన జైస్వాల్... ఈ టెస్టులో మాత్రం నిదానంగా ఆడుతూ, చెత్త బంతులు పడినప్పుడే బ్యాట్ కు పనిచెప్పాడు. మొత్తం 387 బంతులు ఆడిన జైస్వాల్ 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
మరో ఎండ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులకు అవుట్ కాగా... జైస్వాల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మాన్ గిల్ కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 392 పరుగులు. విరాట్ కోహ్లీ 65, రవీంద్ర జడేజా 20 పరుగులతో ఆడుతున్నారు. రహానే 3 పరుగులకే అవుటయ్యాడు.
వెస్టిండీస్ జట్టులో ఏకంగా 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా, టీమిండియా ఆధిక్యం 242 పరుగులకు చేరుకుంది.