Gas leake: ఏపీలో బోరులో నుంచి ఎగసిపడుతున్న అగ్ని కీలలు.. వీడియో ఇదిగో!
- కోనసీమలోని రాజోలు ఆక్వా చెరువు వద్ద ఘటన
- 20 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్న మంటలు
- భయాందోళనలో స్థానికులు.. రంగంలోకి ఓఎన్జీసీ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లోని రాజోలులో బోరులో నుంచి గ్యాస్, మంటలు ఎగసిపడుతున్నాయి. బోరు పైన సుమారు 20 అడుగుల మేర అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం నుంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనం భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో గతంలో సెస్మిక్ సర్వే జరిగిందని స్థానికులు తెలిపారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం ఆరేళ్ల క్రితం అదే ప్రాంతంలో బోరు వేశారని, రెండు రోజుల క్రితం బోరును మరింత లోతుకు తవ్వారని వివరించారు.
ఈ రోజు (శనివారం) ఉదయం ఆ బోరులో నుంచి గ్యాస్, దాంతో పాటే మంటలు ఎగసిపడ్డాయని, అప్పటి నుంచి మంటలు చల్లారటంలేదని తెలిపారు. అయితే, పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయితే వెంటనే ఆపేసే అవకాశం ఉండేదని, భూమిలో నుంచి గ్యాస్ ఎగసిపడుతుండడంతో మంటలు ఆర్పడం కష్టంగా మారిందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.