Pawan Kalyan: అంబటి రాయుడితోను ప్రశంసలు ఇప్పించుకున్నారుగా!: రఘురామకృష్ణరాజు
- వాలంటీర్ల పోస్టులు అంటే యువతను నిర్వీర్యం చేయడమేనన్న రఘురామ
- వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అని విజయసాయి చెప్పారన్న ఎంపీ
- విజయసాయిరెడ్డి చెప్పిందే పవన్ కల్యాణ్ మాట్లాడితే విమర్శలా?
- జగ్గూబాయ్ అంటూ పవన్ మంచి కౌంటర్ ఇచ్చారన్న రఘురామ
వాలంటీర్ల వ్యవస్థపై నర్సాపురం ఎంపీ, వైసీపీ అసంతృప్త నేత రఘురామ కృష్ణరాజు శనివారం స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... వాలంటీర్ల పోస్టులు అంటే యువతను నిర్వీర్యం చేయడమేనని మండిపడ్డారు. వాలంటీర్ పేరుతో అంతమంది యువత భవిష్యత్తును నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో చెప్పారని, ఇవే వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తే మాత్రం విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. కుటిల రాజకీయాల కోసం నిర్మించిందే ఈ వ్యవస్థ అన్నారు.
వాలంటీర్ అంటే స్వయంగా సేవచేసేవారని, అలా సేవ చేయడానికి వచ్చే వారికి డబ్బులు ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థపై వారికే నమ్మకం లేకుండా పోయిందని, అందుకే అంబటి రాయుడితో కూడా ప్రశంసలు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ రోజు తన సోషల్ మీడియా రచ్చబండ కార్యక్రమంలోను రఘురామ... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇన్నాళ్లు వైసీపీ నేతలు చేసిన అవమానాలను పవన్ సహించారని, వారు చాలా అసహ్యంగా మాట్లాడారన్నారు. జగన్ కూడా దత్తపుత్రుడు, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఎద్దేవా చేశారన్నారు. అన్నీ ఓర్చుకున్న పవన్ మాత్రం ఇప్పుడు జగ్గూబాయ్ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారన్నారు. జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదని, కనీసం తనకు శత్రువుగా ఉండే అర్హత కూడా లేదని పవన్ మంచి సమాధానం ఇచ్చారన్నారు.
తనకు నలుగురు పెళ్లాలు లేరని జగన్... పవన్ ను ఉద్దేశించి అన్నారని, కానీ అదే జనసేనానిపై కేసులు కూడా లేవన్నారు. ఆయన జీవితంలో మూడు పెళ్లిళ్లు అలా జరిగింది.. దానికి ఎవరేం చేస్తారన్నారు. ఈ సందర్భంగా రఘురామ... జగన్ ను జమోరే (జగన్ మోహన్ రెడ్డి) అని పలుమార్లు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు పవన్ కేవలం టీజర్ మాత్రమే చూపించారని, రాష్ట్రమంతా తిరిగి మొత్తం చూపిస్తారన్నారు.
వైసీపీ నేత అయిన నటి ఒకరు.. పవన్ కల్యాణ్ ను సన్నీ లియోన్ తో పోల్చారని, కానీ సోషల్ మీడియాలో ఆమెపై సెటైర్లు వస్తున్నాయని రఘురామ అన్నారు. నేనైతే ఆపేశాను.. మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని సోషల్ మీడియాలో రీట్వీట్లు వచ్చాయన్నారు. ఎవరైనా మాటలను అదుపులో ఉంచుకోవాలని, పొదుపుగా వాడాలన్నారు.