New Delhi: యమున ఉద్ధృతి తగ్గినా.. సెల్ఫీలు వద్దు!: కేజ్రీవాల్ విజ్ఞప్తి
- సరదా కోసం వరదలో ఈత కొట్టవద్దని, వీడియోలు, సెల్ఫీలు తీసుకోవద్దని హెచ్చరిక
- ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచన
- ముకుంద్పుర్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలు ఈత కొట్టేందుకు వెళ్లి మృతి
యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ ప్రజలు ఎవరూ ఈత కొట్టవద్దని, వరద ప్రాంతాలను సందర్శించి సెల్ఫీలు, వీడియోలు తీసుకొని ఇబ్బందులకు గురి కావొద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలోను ముకుంద్పుర్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలు వరద నీటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించి మరణించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీ పౌరులను హెచ్చరించారు.
సరదా కోసం వరద ప్రవాహంలో ఈత కొట్టడం చేయవద్దని, సెల్ఫీల కోసం ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చాలాచోట్ల వరద ప్రవాహంలో కొందరు ఈత కొడుతున్నట్లు, సెల్ఫీలు దిగుతున్నట్లుగా, వీడియోలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఇవి చాలా ప్రమాదకర చర్యలు అని హెచ్చరించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
యమునా నదిలో నీటి మట్టం తగ్గుతోంది. శనివారం ఉదయం 9 గంటలకు 207.58 మీటర్లకు తగ్గింది. రాత్రి 10 గంటలకు 206.72 మీటర్లకు తగ్గే అవకాశముంది.