Suchitra Krishna Murthy: గతంలో రామ్ గోపాల్ వర్మకు పెళ్లి ప్రపోజల్ చేసిన సీనియర్ గాయని... ఆ తర్వాత ఏం జరిగిందంటే...!

What happened after Suchitra Krishnamurthy sent marriage proposal to Ram Gopal Varma
  • 'డ్రామా క్వీన్' పేరిట ఆటోబయోగ్రఫీ రాసిన సుచిత్ర కృష్ణమూర్తి
  • వర్మకు పెళ్లి సందేశం పంపితే వర్మ తిరస్కరించాడని వెల్లడి
  • వర్మ చెప్పిన సంచలన సమాధానాన్ని కూడా తన పుస్తకంలో పేర్కొన్న గాయని
దర్శకుడు శేఖర్ కపూర్ ను పెళ్లాడి, ఆ తర్వాత విడాకులు తీసుకున్న ప్రముఖ గాయని, నటి సుచిత్ర కృష్ణమూర్తి 'డ్రామా క్వీన్' పేరిట స్వీయ జీవితగాథ రాశారు. అందులో కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాను పెళ్లి ప్రపోజల్ పంపితే, అందుకు ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారో కూడా సుచిత్ర తన ఆటోబయోగ్రఫీలో వివరించారు. 

"మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ వర్మకు మెసేజ్ చేశాను. ఆ సందేశానికి వర్మ స్పందించారు. తాను పెళ్లికి వ్యతిరేకం అని, స్త్రీలను కేవలం సెక్స్ కోసమే ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అతివల దేహాలు అంటేనే నాకిష్టం... వారి మనసులు కాదు అని కూడా వర్మ చెప్పారు. స్త్రీలు కనిపించాలంతే.... వినిపించకూడదు అని కూడా వెల్లడించారు" అంటూ సుచిత్ర పేర్కొన్నారు. 

అయితే, బాలీవుడ్ ఠికాణా అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిత్ర తాను వర్మను పెళ్లాడాలనుకోవడం ఓ జోక్ అని కొట్టిపారేశారు. తాను సరదాగానే వర్మకు పెళ్లి ప్రపోజల్ పంపానని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తిని పెళ్లాడడం జరిగే పనేనా? అంటూ సుచిత్ర వ్యాఖ్యానించారు. 

వర్మ చాలా మంచి వ్యక్తి అని, అయితే తాను పంపిన మెసేజ్ చూసి ఆయన భయపడిపోయారని వెల్లడించారు. "వెంటనే నన్ను ఆయన తన ఆఫీసుకు రమ్మన్నారు. నువ్వు చాలా మంచి అమ్మాయివి... ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తానెంత చెడ్డవాడ్నో కూడా వివరించి నా మనసు మార్చాలని చూశారు. రామూ, ఇదంతా ఓ జోక్ అని చెప్పినా, ఆయన మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు" అని సుచిత్ర వివరించారు. 

సుచిత్ర కృష్ణమూర్తి, శేఖర్ కపూర్ 1999లో పెళ్లితో ఒక్కటయ్యారు. వారు 2007లో విడిపోయారు. అయితే, తమ వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి నటి ప్రీతి జింటానే కారణమని అప్పట్లో సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు.
Suchitra Krishna Murthy
Ram Gopal Varma
Proposal
Marriage
Sekhar Kapoor
Bollywood

More Telugu News