tomato: బోల్తాపడిన టమాటా లారీ.. ఎత్తుకెళ్లకుండా సెక్యూరిటీ!
- కోలార్ నుండి ఢిల్లీ వెళ్తున్న టమాటా లారీ
- ఆదిలాబాద్ జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడిన లారీ
- మరో లారీని రప్పించి తరలించిన అధికారులు
అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా పంట నష్టం, సరఫరా ఇబ్బందుల నేపథ్యంలో టమాటా ఖరీదుగా మారింది. రిటైల్ గా కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అధిక ధర పలుకుతున్న పలుచోట్ల కేంద్రం రాయితీపై కిలో రూ.90కే విక్రయిస్తోంది. మొత్తానికి గత కొన్నిరోజులుగా టమాటా ధరలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలో జాతీయ రహదారిపై ఓ టమాటా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. టమాటాలు మొత్తం రోడ్డుపై పడిపోవడంతో వాటిని ఎత్తుకెళ్లకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. లారీ బోల్తా పడ్డ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. లారీ యజమాని విజ్ఞప్తి మేర మరో లారీని తెప్పించి అందులో టమాటాలను తరలించారు. ఈ లారీ కర్ణాటకలోని కోలార్ నుండి ఢిల్లీ వెళ్తోంది. గతంలో టమాటాలకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి వెళ్లిన సంఘటనలు చూశాం. ఇప్పుడు అదే రోడ్డుపై పడిన టమాటాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం గమనార్హం.