Marketa Vondrousova: అన్ సీడెడ్ గా వచ్చి... వింబుల్డన్ టైటిల్ ఎగరేసుకెళ్లిన వొండ్రుసోవా
- వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత మార్కెటా వొండ్రుసోవా
- ఫైనల్లో వరుస సెట్లలో ఆన్స్ జాబెర్ పై విజయం
- ఎలాంటి సీడింగ్ లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన వొండ్రుసోవా
- ప్రపంచ ర్యాంకింగ్స్ లో 42వ స్థానంలో ఉన్న చెక్ అమ్మాయి
అన్ సీడెడ్ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా (24) ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6-4, 6-4తో ట్యునీషియా క్రీడాకారిణి ఆన్స్ జాబెర్ ను ఓడించింది.
42వ ర్యాంకు క్రీడాకారిణి వొండ్రుసోవాకు వింబుల్డన్ లో ఎలాంటి సీడింగ్ లేదు. అయినప్పటికీ, తనకంటే మెరుగైన ర్యాంక్ క్రీడాకారిణులను మట్టికరిపించి కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ను సాధించింది. ఫైనల్ కు ముందు నాలుగో సీడ్ క్రీడాకారిణి పెగులా, ఎలినా స్విటోలినా వంటి స్టార్ క్రీడాకారిణులు వొండ్రుసోవా క్లాసిక్ గేమ్ ముందు దాసోహమన్నారు.
వొండ్రుసోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచింది. ఇప్పటివరకు ఆమెకు అదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ తో గ్రాండ్ స్లామ్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.