Nara Lokesh: లోకేశ్ కు భావోద్వేగ వీడ్కోలు పలికిన నెల్లూరు నేతలు... యువగళానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అపూర్వ స్వాగతం
- ఉదయగిరి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
- కందుకూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ
- ఉద్వేగానికి గురైన ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు
- ఆత్మీయంగా హత్తుకున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండ్రోజుల విరామం తర్వాత నేడు పునఃప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకున్న లోకేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టారు.
కాగా, ఉమ్మడి నెల్లూరు జిల్లాను లోకేశ్ వీడుతున్న నేపథ్యంలో నేతలు కోటంరెడ్డి బ్రదర్స్ (శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి), ఆనం రామనారాయణరెడ్డి తదితరులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లో రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరు ఇన్ చార్జి దినేష్ రెడ్డి, ఉదయగిరి ఇన్ చార్జి బొల్లినేని రామారావు, పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కైవల్యారెడ్డి, బీద గిరిధర్, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు లోకేశ్ కు భావోద్వేగ వీడ్కోలు పలికారు.
ఉద్వేగానికి గురైన నేతలను ఆత్మీయంగా హత్తుకున్న లోకేశ్ వారికి కర్తవ్య బోధ చేశారు. జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు.
31 రోజుల పాటు తనను కుటుంబ సభ్యుడి మాదిరిగా ఆదరించి ఆతిథ్యమిచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రుణం తీర్చుకుంటానని చెప్పారు.
ఇక, కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన లోకేశ్ ను స్థానిక నేతలు ఘనంగా ఆహ్వానించారు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల జనార్దన్, పోతుల రామారావు, దివి శివరాం, నూకసాని బాలాజీ, గొట్టిపాటి రవి, ఎంఎం కొండయ్య, బీఎన్ విజయ్ కుమార్, ఇంటూరి రాజేష్, మాల్యాద్రి, ఎరిక్షన్ బాబు, ముత్తమల అశోక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో రాళ్లపాడు ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి. భారీ కటౌట్లతో స్వాగత ద్వారాలు ఏర్పాట్లు చేశారు. లోకేశ్ ను గజమాలలతో సత్కరించారు. బాణాసంచా మోతలు, డప్పుశబ్దాలతో హోరెత్తించారు. కందుకూరు నియోజకవర్గంలో లోకేశ్ కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. లోకేశ్ తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.