Pawan Kalyan: ఎన్డీయే సమావేశానికి రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం.. హాజరవుతున్న జనసేనాని!
- జులై 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం
- పవన్ ను ఆహ్వానించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఎన్డీయే
- ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారన్న జనసేన పార్టీ
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వారాహి యాత్రతో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ రాష్ట్ర అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లోని ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది.
తాజాగా, ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. జులై 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేనకు కూడా స్థానం కల్పించినట్టు అర్థమవుతోంది.
ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారని జనసేన పార్టీ వెల్లడించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఈ నెల 17 సాయంత్రం పవన్ ఢిల్లీ చేరుకుంటారని వివరించింది.