Air India: ఎయిర్ ఇండియా అధికారి చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు
- సిడ్నీ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఘటన
- బిజినెన్ క్లాస్ నుంచి ఎకనామీ క్లాస్‌కు మారిన సీనియర్ అధికారి
- పక్క సీటులో ప్రయాణికుడి హంగామా
- మర్యాదగా నడుచుకోవాలని అతడికి సూచించినందుకు దాడికి దిగిన వైనం
ఎయిర్ ఇండియాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జులై 9న నుంచి సిడ్నీ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ సీనియర్ ఎయిర్ ఇండియా అధికారిపై తోటి ప్రయాణికుడు చేయిచేసుకున్నాడు. ఎయిర్ లైన్స్ ఇన్‌ఫ్లైట్ సేవల విభాగానికి నేతృత్వం వహిస్తున్న సందీప్ వర్మ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అయితే, అక్కడ కొన్ని సీట్లలో సర్వీసు అందుబాటులో లేక ఆయన ఎకానమీ తరగతికి మారాల్సి వచ్చింది.
ఈ క్రమంలో పక్క సీటులోని ప్రయాణికుడు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో పద్ధతిగా నడుచుకోవాలని సందీప్ అతడికి సూచించారు. దీంతో రెచ్చిపోయిన అతడు సందీప్ చెంప ఛెళ్లుమనిపించి, ఆయన చేతిని మెలితిప్పే ప్రయత్నం చేశాడు. అతడు ఎలాంటి ఇబ్బంది సృష్టించకుండా సీటులోనే బంధించాలని సిబ్బందిని సందీప్ కోరినా ఆయన సూచన అమలు కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
విమానం ఢిల్లీకి చేరిన వెంటనే అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. చివరకు అతడు సందీప్‌కు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ ఘటనతో మరోమారు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికుల భద్రతపై చర్చ మొదలైంది.