Arif Khan Gurjar: ప్రాణాలు కాపాడిన వ్యక్తిని చూసి ఆనందంతో గంతులేసిన కొంగ
- ఏడాది క్రితం గాయపడిన కొంగను రక్షించి ప్రాణాలు కాపాడిన అరిఫ్
- అతడిని విడిచి ఉండలేకపోయిన కొంగ
- బలవంతంగా కాన్పూరు జూకు తరలించిన అటవీ అధికారులు
- అతడిని చూసి సంతోషంతో గంతులేసిన కొంగ
తన ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించిన వ్యక్తిని చూసిన కొంగ ఆనందంతో గంతులేసింది. అతడిని చేరుకునేందుకు ఉబలాటపడింది. రెక్కలు ఆడిస్తూ, ప్రేమగా అరుస్తూ నృత్యం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన అరిఫ్‌ఖాన్ గుజ్రార్ ఏడాది క్రితం తన పొలానికి వెళ్లగా అక్కడ తీవ్రంగా గాయపడి విలవిల్లాడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షి అయిన సారస్ కొంగ కనిపించింది. వెంటనే దానిని చేతుల్లోకి తీసుకున్న అరిఫ్ దాని ప్రాణాలు కాపాడాడు. చాలాకాలంపాటు దానిని సంరక్షించాడు. దీంతో ఆ కొంగ అతడిని విడిచి ఉండేది కాదు. అతడు ఎక్కడికి వెళ్లినా ఎగురుకుంటూ అతడితోపాటే వెళ్లేది.
విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు కొంగను స్వాధీనం చేసుకుని బలవంతంగా కాన్పూరు జూకు తరలించారు. తాజాగా కొంగను చూసేందుకు అరిఫ్ జూకు వెళ్లాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించాడు. అతడిని చూసిన కొంగ వెంటనే గుర్తుపట్టేసింది. రెక్కలు ఊపుతూ, అరుస్తూ పట్టరాని సంతోషంతో అతడి వద్దకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని అరిఫ్ తన సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.