Viral Videos: బిడ్డలు చూస్తుండగానే సముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళ.. వీడియో ఇదిగో
- ముంబైలోని బాంద్రా ఫోర్టు వద్ద సముద్రతీరాన వీడియో దిగేందుకు ఓ జంట ప్రయత్నం
- బిడ్డకు కెమెరా ఇచ్చి రికార్డు చేయాలని సూచన
- సముద్రం పోటు మీద ఉండడంతో భారీ ప్రమాదం
- పెద్ద అల రావడంతో రాళ్లపై కూర్చున్న మహిళ సముద్రంలో పడి దుర్మరణం
- నెట్టింట వీడియో వైరల్
ప్రతి క్షణాన్ని తీపి గుర్తుగా కెమెరాల్లో బంధించాలన్న యావ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తోంది. ముంబైలో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త, బిడ్డలతో పాటూ సముద్రం ఒడ్డున పిక్నిక్ వెళ్లిన ఓ మహిళ అనూహ్యంగా సముద్రపు అలలకు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మహిళ, ఆమె భర్త సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై కూర్చుని వీడియో దిగేందుకు ప్రయత్నించారు. వారి పిల్లలు దూరంగా నిలబడి తల్లిదండ్రులను కెమెరాతో రికార్డు చేయసాగారు. ఇంతలో పెద్ద అల రావడంతో మహిళ జారి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అతడు కూడా నీళ్లల్లోకి జారిపోకుండా చుట్టుపక్కల వారే కాపాడారు. నీళ్లల్లోకి జారిపోతున్న తల్లిని చూసి ఆ పిల్లలు కంగారు పడిపోతూ అమ్మా అమ్మా అని అరవడం నెటిజన్లను కదిలిస్తోంది.
వాస్తవానికి ఆ కుటుంబం మొదట జుహూ చౌపట్టీకి వెళదామనుకున్నారట. కానీ సముద్రం పోటు మీద ఉండటంతో అధికారులు బీచ్‌లోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో, ఆ కుటుంబం బాంద్రాకు వెళ్లింది. బాంద్రా కోట సమీపంలో తీరంలోని రాళ్లవద్దకు వెళ్లి ఫొటోలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు మృతురాలిని జ్యోతి సోనార్‌గా గుర్తించారు. సోమవారం కోస్ట్‌గార్డు ఆమె మృతదేహాన్ని వెలికితీశారు.