Arvind Kejriwal: డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు.. ఆప్ నేతలకు హర్యానా సీఎం కౌంటర్
- ఢిల్లీ వరదలకు బీజేపీ సర్కారు కుట్రే కారణమని ఆప్ నేతల ఆరోపణ
- బ్యారేజీ సామర్థ్యం నిండిపోతే నీరు వదలాల్సిందేనన్న మనోహర్ లాల్ ఖట్టర్
- తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
ఢిల్లీలో భారీ వరదలకు కేంద్ర ప్రభుత్వం, హర్యానా సర్కారు చేసిన కుట్రే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయడం వల్లే యమునా నది నీటిమట్టం పెరిగి ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు వచ్చాయని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు మండిపడ్డారు. తాజాగా ఈ ఆరోపణలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఆప్ నేతలకు డ్యామ్ కు, బ్యారేజీకి తేడా తెలవదని విమర్శించారు. హత్నికుండ్ బ్యారేజ్ మాత్రమేనని, డ్యామ్ కాదని గుర్తుచేశారు.
బ్యారేజ్ సామర్థ్యానికి మించి వరద చేరితే కిందికి నీటిని విడుదల చేయడం మినహా ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారు. హత్నికుండ్ బ్యారేజ్ సామర్థ్యం లక్ష క్యూసెక్కులు మాత్రమేనని, అంతకుమించిన వరద రావడం వల్లే నీటిని యమునా నదిలోకి విడుదల చేశామని చెప్పారు. ఈ విషయంపై ఢిల్లీ సర్కారుకు తాము ముందే సమాచారం ఇచ్చామని, అయినా తగిన ఏర్పాట్లు చేయడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని చెప్పారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, హర్యానా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఖట్టర్ మండిపడ్డారు.