Jaishankar: ఎవరు ఉత్తమ దౌత్యవేత్త?.. విదేశాంగ మంత్రి సమాధానమిదే!
- అన్ని కాలాలకూ అత్యుత్తమ దౌత్యవేత్త హనుమంతుడేనన్న జైశంకర్
- తనకు అంతగా తెలియని లంకకు వెళ్లి, పని ముగించుకుని వచ్చాడని వ్యాఖ్య
- రాజ్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో మహాభారతం వివరిస్తుందని వెల్లడి
ఉత్తమ దౌత్యవేత్త ఎవరు అనే దానిపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని కాలాలకూ అత్యుత్తమ దౌత్యవేత్త హనుమంతుడేనని ఆయన అభిప్రాయపడ్డారు. థాయిలాండ్ లో ఉన్న ఆయన.. అక్కడి భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ఎవరు ఉత్తమ దౌత్యవేత్త అని మీరు నన్ను అడిగితే.. నా సమాధానం.. హనుమంతుడు! తనకు పెద్దగా తెలియని లంకకు వెళ్లాడు.. సీతమ్మను గుర్తించాడు. ఆమె మనోధైర్యాన్ని పెంచాడు.. తర్వాత అక్కడి ప్రదేశానికి నిప్పంటించి వచ్చాడు” అని వివరించారు. అయితే ఇలా తగులబెట్టాలని తాను దౌత్యవేత్తలకు సలహా ఇవ్వడం లేదని చమత్కరించారు. మొత్తం మీద చూసినపుడు హనుమంతుడు విజయవంతంగా తిరిగి వచ్చాడని అన్నారు.
దౌత్యవేత్తగా పదవీ విరమణ చేసిన తర్వాత, రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒక ఏడాదిపాటు తాను ఖాళీగా ఉన్నానని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో తాను ఓ పుస్తకాన్ని రాశానని చెప్పారు. మహాభారతం ఏ విధంగా మార్గదర్శకంగా నిలుస్తుందో తాను ఈ పుస్తకంలో వివరించానని తెలిపారు. రాజ్య వ్యవహారాలను నైపుణ్యంతో నిర్వహించడం గురించి మహాభారతం వివరిస్తుందన్నారు.