Revanth Reddy: తెలంగాణ రైతులకు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ!

tpcc president revanth reddy written an open letter to ts farmers

  • రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న రేవంత్
  • రైతులను మోసం చేయడంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు అని విమర్శ
  • 10 గంటలు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం లేదని ఆరోపణ

తెలంగాణ రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయానికి కనీసం 10 గంటలు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పుడు రైతుతోనే రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయల్దేరిందని ఆరోపించారు. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచి.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి అధికార పార్టీ బరితెగించిందని మండిపడ్డారు. 

రైతు రుణమాఫీ కోసం ఇన్నాళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశామని రేవంత్ రెడ్డి చెప్పారు. చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం అయిపోయిందని, ఇక రుణమాఫీ ఉండదన్న విషయంపై స్పష్టత వచ్చిందని అన్నారు.

‘‘రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని రేవంత్ విమర్శించారు. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని చెప్పారు.

గత 9 ఏళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని మండిపడ్డారు. 

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి 10 గంటలు కూడా ఇవ్వడం లేదని రేవంత్ ఆరోపించారు. సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్ లే ఇందుకు సాక్ష్యాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని, అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్‌లను ప్రభుత్వం వెనక్కు తెప్పించుకుందని అన్నారు.

‘‘రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక అవకాశం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News