Payyavula Keshav: రాయలసీమ ప్రాజెక్టు పనుల్లో అప్పుడు కోర్టులను, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: పయ్యావుల
- రాయలసీమ ప్రాజెక్టులపై పయ్యావుల ప్రెస్ మీట్
- రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలైందని వెల్లడి
- దేనికి రుణం తీసుకున్నారో తేలాలని డిమాండ్
- సీబీఐ విచారణకు మంత్రి అంబటి ఆమోదించారన్న పయ్యావుల
- త్వరలోనే సీబీఐకి లేఖ రాస్తామని స్పష్టీకరణ
పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరవైందని అన్నారు. రుణం తీసుకున్నది రాయలసీమ ప్రాజెక్టు ఇన్వెస్ట్ గేషన్ పనులకో? ప్రాజెక్టు నిర్మాణ పనులకో తేలాలి అని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయబోమని కోర్టును మోసం చేశారని ఆరోపించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయబోమని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన పీఎఫ్ సీకి, ఆర్ ఐసీకి తెలుపకుండా మోసం చేసి రుణం తెచ్చారని పయ్యావుల ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన రూ.7 వందల కోట్లలో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కు వంద కోట్లు పోయినా... మిగతా 6 వందల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? అని ప్రశ్నించారు.
కోర్టులను, ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని పయ్యావుల తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టు పనుల నిధుల వినియోగం సరిగా జరగడంలేదని, నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందుకే సీబీఐకి లేఖ రాస్తున్నామని తెలిపారు. సీబీఐ విచారణకు మంత్రి అంబటి రాంబాబు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.