Sharad Pawar: బెంగళూరులో ఈరోజు జరగనున్న విపక్షాల సమావేశానికి శరద్ పవార్ దూరం.. కారణం ఇదే!
- బెంగళూరులో ఈరోజు, రేపు సమావేశమవుతున్న విపక్షాలు
- రేపు తన కుమార్తెతో కలిసి సమావేశాలకు హాజరు కానున్న పవార్
- ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటమే కారణం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే పాట్నాలో జూన్ 23న తొలి విడత సమావేశం ముగిసింది. తాజాగా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు బెంగళూరులో విపక్షాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చించనున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య కూడా ఏకాభిప్రాయం రావడంతో తాజా సమావేశాలు మరింత జోరుగా సాగనున్నాయి. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
మరోవైపు విపక్షాల కూటమిలో కీలక నేత అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈనాటి సమావేశానికి హాజరుకావడం లేదు. తన కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలేతో కలిసి రేపు ఆయన సమావేశంలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ ఈరోజు జరిగే విపక్ష సమావేశానికి హాజరుకావడం లేదు.